అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

4, ఆగస్టు 2013, ఆదివారం

కోడినక్కపిల్ల కథ

 కోడినక్కపిల్ల కథ
                 లోకంలో అదృష్టవంతులతో పాటు అమాయకులు ఎందరో ఉంటారు. అమాయకులతో పరాచకాలు ఆడితే  కొన్ని సందర్భాలలో  ప్రమాదాలు కూడా ఏర్పడతాయి. ఈ కథనంలో అనగనగా ఓ అమాయకుడు !
అతని పేరు "అబద్ధం"   పేరేంటి ఇలా ఉంది అనుకోకండి. అతని తల్లిదండ్రులకు ఎంతో కాలానికి లేక లేక పుట్టిన సంతానం. అబద్ధం అని పేరు పేడితే మంచి ఆయుర్ధాయం కలవాడు అవుతాడని  ఓ సాములోరు చెప్పడంతో తమ సంతానం నిలబడ్డానికి ఈ పేరే ఖరారు చేసుకున్నారు అతని తల్లిదండ్రులు అతను పుట్టడానికి ముందే.

                 అబద్ధం నిజంగానే అబద్దాలు తెలియని అమాయకుడు. పెళ్ళీడు రావడంతో అతనికి పెళ్ళిచేసి తొలి పండగకు అత్తవారింటికి పంపదలచింది అతని తల్లి.ముందుగా కొన్ని సూచనలు చేసింది.

            ఓ రేయి "అబద్ధం" నొటిలో వేలు పెడితే కొరకడం కూడా తెలియని నీ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తోంది.
దానికి తోడు మృదువుగా  మాట్లాటడం కూడా నీకు నేర్పలెమో ? నీ మాటలలో కల్మషం లేక పొయినా.............. కఠినంగా మాట్లాడకూడదురా , అత్తవారింటికి కూడా వెళుతున్నావు ఎక్కువగా మాట్లాడకుండా ముచ్చటగా మూడు మాటలు మృదువుగా మాట్లాడు. అంటూ తల్లి హితబోధలు చేసింది. నీ తండ్రి పోయి ఏడ్నార్ధం అవుతోంది. నేనెంత కాలమో........? కాస్తా తెలివిగా ఆలోచించి అన్నిపనులు చూసుకుంటూ ఉండాలి. రామాపురం వెళ్ళి నీ భార్యను తెచ్చుకుని ఇక్కడ హాయిగా జీవించు. నేనా కాశీకి పొతున్నాను. అంటే కాటికి పోవడం లాంటిదేరా! భార్యతో కూడా మృదువుగా మాట్లాడుతూ నీ పనులు చెక్కబెట్టుకోవాలి. నేను మళ్ళీ తిరిగి వస్తానని ఆశించకు.

                   అమాయకుడు అయిన అబద్ధానికి తల్లి మాటలలో మృదువుగా అన్న పదం బాగా నచ్చింది. మెత్తగా ఉండేవి ఏమిటా అని తెగ ఆలోచించాడు. అవి కూడా మూడు కావాలి కదా. ఇల్లంతా కలయ దిరిగి మొత్తానికి ఎలాగయితేనేమి మెత్తగా ఉండే మూడు పదాలను పట్టుకున్నాడు. మొదటగా తణివి చూసి మరీ ఆ..... దూది మెత్తగా ఉంది. తరవాత వెన్న మెత్తగా ఉన్నట్లు తోచింది. పెరట్లోకి వచ్చి వెతికాడు కట్టేసిన దున్నపోతు ముడ్డిమీద చెయ్యి వేసాడు అరే ఇదికూడా మృదువుగానే ఉంది. అమ్మయ్య... నాకు కావల్సిన మూడు మాటలు దొరికేసాయి. అనుకుని అత్తవారింటికి పయనమయ్యాడు.
                        రామాపురం చేరుతూనే మూడు మాటలూ నెమరు వేసుకుంటూ అత్తవారింట్లో ప్రవేశించాడు. అంతా చుట్టూ చేరారు, బాబూ బాగున్నారా!  అత్తమామలు పలకరించారు. బావా బాగున్నావా ! ముగ్గురు బామ్మర్దులు ముక్త కంఠంగా పలకరించారు. చిన్నా పెద్దా అంతా మాటాడండి బాబూ అంటూ చుట్టుముట్టారు. భార్య వైపు ఓ చూపు చూసి మిన్నకున్నాడు అబద్ధం . ఏమండి చెప్పండీ లేకపోతే నీ మొగుడు దద్దమ్మే అంటూ నన్ను వెక్కిరిస్తారంతా, ఏం చెప్పాలో తెలీక భార్య వైపు గిరుక్కున తిరిగి చురుక్కుమనేలా చూస్తూ...... ఏం చెప్పమంటావే దూది, వెన్న, దున్నపోతుముడ్డి చాలా? 
               అల్లుడు గారు ప్రయాణ బడలికలో ఉన్నారని గ్రహించి అతని మాటలు పట్టించుకోకుండా తమ ఆతిథ్యానికి మురిసిపోవాలని భావిస్తూ అంతా సపర్యలు చేసారు. బావమరుదులు కూడా అనునయంగా మాట్లాడుతూ  బిగుసుకున్న అతని బిడియాన్ని సడలించే ప్రయత్నంగా మర్నాడు సాయంత్రం వరకూ ఆగి తమ పొలానికి తీసుకెళ్ళారు. వాళ్ల పనీ అవుతుంది. బావగారికి వ్యాహ్యాళిగా ఉంటుందని వారి భావన.
                             ఆ.... ఊ..... అంటూ తప్ప అబద్ధం ఏమీ మాట్లాడలేదు. అంతా గమనిస్తున్న వాడిలా ప్రవర్తిస్తూ నేను పట్నపోడినని మీది పల్లెటూరని అనుకోపోతే ఈ విషయం చెప్పండి అని నోరు విప్పాడు. బావగారికి వ్యవసాయం గురించి తెలియదన్న సంగతి వాళ్ళు గ్రహించేసారు. ఇది శెనగ చేను అన్నారు కదా, మరి శెనక్కాయ లేవి అని ప్రశ్నించాడు అబద్ధం. కాయలు భూమిలో ఉంటాయ్ బావగారూ!నీజం చెప్పినా తనను ఆటపట్టిస్తూన్నారు అనుకున్నాడు "అబద్ధం". నేల లోన్చి కాయలు పీకి తాటికమ్మలేసి కాల్చి ఇచ్చే వరకు అతని ఆశ్చర్యనికి బావమరుదులు అబ్బుర పడ్డారు. 

                    ఇంతలో చీకటి పడడం తో బుడ్డి దీపాలు వెలిగించేరు అంతా! పట్నంలో పెరిగిన అమాయకత్వం చేత ఇవెలా వచ్చాయి అని అడిగాడు "అబద్ధం". వేళాకోళం ఆడాలనిపించి వీటిని కోడినక్కపిల్లలంటారు బావా! ఇవి మన కళ్ళం లోనే పండుతాయి. మరెక్కడా పండవు. రహస్యంగా అన్నారు. అయితే నాకోటియిద్దురు. కరెంటు పొయినప్పుడు మాకు ఉపయోగపడతాయి. అలాగే తప్పకుండా....మీరు పట్నం వెళ్ళేటప్పుడు సారేలో పెట్టిస్తాం.
నవ్వుకుంటూ ముక్తకంఠంగా అన్నారు. వాళ్ళ మాటలు ఏందుకో నమ్మబుద్ధికాలేదు "అబద్ధానికి". సరే అంటూ ఇంటికి చేరుకున్నారంతా. రాత్రి భోజనాల దగ్గర కూడా కోడి నక్కపిల్లలు "అబద్ధానికి దర్శనమిచ్చాయి. భలే బాగున్నాయి అనుకున్నాడు మనసులో. మామ గారు అనునయంగా బాబు రేపు మంగళవారం మీరేమో రేపే బయలుదేరాలంటున్నారు ఓ పని చేయండి పిల్లని కొత్త కాపరానికి పంపించడం కదా పంతులు గారి చేత మూహూర్తం పెట్టించి మేము తీసుకొచ్చి దిగబెడతాం ప్రస్తుతానికి రేపు మీరు బయలుదేరండి, సారె, చీరలు పెట్టి అమ్మాయిని మీ ఇంటికి తీసుకొస్తాం. 
                                            

                మామగారు అన్నమాటల్లో మీరు రేపు బయలుదేరండి అన్నప్పుడు అబద్ధానికి టక్కున ఓ అనుమానం మెరిసింది. సారె తెస్తారు సరే మరి కోడినక్కపిల్లనిస్తారా? బావగారు చమత్కారులే అందరూ ఫక్కున నవ్వుకున్నారు. రాత్రి పడుకున్నా నడిరేయి దాటినా అబద్ధానికి మాత్రం నిద్ర పట్టలేదు. అందరూ నవ్వుకున్నారన్న ఉక్రోషం పట్టలేక పోయాడు. వీళ్ళకి చెప్పీ పెట్టకుండా కోడినక్కపిల్లను మాత్రం పట్టుకుపోవాలని నిశ్చయించుకున్నాడు. ఎదురుగా మినుకు మినుకు మంటూ కనిపిస్తున్న కోడినక్కపిల్లని తన చేతిసంచీని భద్రంగా ఆ తాటాకుల ఇంట్లో వీధి చూరులో పెట్టి మెల్లగా ఓ రెండు గంటలు కాలక్షేపం చేసి వెళ్లి పోవాలనుకున్నాడు. ఇంతలో నిద్రా దేవత అతణ్ణి ఒడిలోకి తీసుకుంది.  

                   తెలివొచ్చేసరికి పెద్ద కేకలు హాహాకారాలు మంటలు వాటినార్పుతున్న బామ్మర్దులు. అబద్ధం మాత్రం చూరుదగ్గర నిశితంగా వెతుకుతున్నాడు. బాబూ ఏం వెతుకుతున్నారు? మామగారు ప్రశ్నించారు, అదే ఆ కోడినక్కపిల్ల ఈ చూరుక్రింద పెట్టానన్న అతని మాటలతో బిగ్గరగా కేకలేస్తూ ఒరేయ్! మీ బావ కొంపలంటిచేసాడురా, వెధవ వేళాకోళాలూ మీరూ................. ముక్కుమీద వేలేసుకుంటూ బిక్కుమనకుండా అంతా నిశ్శబ్ధం..... 
              తెలివితక్కువ తనం ఎంత ప్రాణాంతకమౌతుందో.........??? అలాగే తెలివైనవాడు మరణించినా తను మనుగడను సూచిస్తాడు." అప్రశిఖ " కథనంలో తెలుస్తుంది. మళ్ళీ ఆ కథనంతో కలుద్దాం....