అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

10, జులై 2013, బుధవారం

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు

ఈ కథను మూడు భాగాలుగా చేసి ప్రచురించడం జరిగింది. కాబట్టి  వరుస క్రమాన్ని పాఠించండి.

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు(you are here)

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3                               

                 పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు
                         అదృష్టవంతుడు అంబులెన్స్ క్రింద పడతాడన్నది నేటి సామెత. ఎర్రని యేగానికి కూడా చెల్లుబాటు కాని వాడు అందలాలెక్కాడంటే అది అదృష్టమనే అనుకోవాలి. "నెత్తిమీద రూపాయిపెట్టి పావలాకమ్మినా చెల్లవురా " అని పెద్దలు తిట్టడం నాకు బాగా గుర్తుంది. ఈ రోజుల్లో యేగాని గూర్చిగాని కానీ, దమ్మిడీ, డబ్బు, పైసా లాంటి పదాలు నేటి తరానికి అందుబాటులో లేనివి. చెల్లుబాటుండాలి కానీ విషయమేదైనా..... ? విన ఆశక్తిగానే ఉంటుంది. 
                        కన్నూరుపాలెం అనే కుగ్రామంలో నాకు కో టెనెంట్ గా" పీర్ బీ-- రెహమాన్ " అనే సాయిబు దంపతులు ఉండేవారు. వెన్నెల వాకిట్లో పడుకుని "శారదరాత్రులుజ్వల లసత్తర తారక హారపంక్తులన్" అనే నన్నయగారి పద్యం బిగ్గరగా పాడుకుంటున్నాను. రెహమాన్ పంతులుగారూ నేనో కథ చెబుతాను అన్నాడు. అక్షరం ముక్క కూడా రాని అతగాడి కుతూహలాన్ని గమనించి సరే నీభాషలో చెప్పు  అంటూ శ్రోతగా విన్నాను ఈ నూటికొస్తాదు కథ.
                        కథాకమామీషు ఏంటంటే ................................
                        ఓ మారాజుగారుండే రాజ్యంలో...... నాబోటి అమామీకుడొకడు తన భార్యా పిల్లలతో కలిసి ఓ సత్రంలో బసచేయడానికొచ్చాడు. ఆడొట్టి బద్ధకస్తుడు. ఏ సంపాదనాలేని పేదోడు. రోజువారీ సంపాదన సేతకాని ఆడితో ఆయమ్మ ( వాడి భార్య లెండి ) ఏదో ఏగుతోంది. సత్రంకూడు, మఠం నిద్రచేస్తూ రోజులు గడిపేత్తన్నారు. 
                            ఆదేశపు మారాజుగారికి మంత్రిగారితో కలిసి పుర ఈదుల్లో మారేశాలేసుకుని తిరుగుతూ.... పెజలేటనుకుంటున్నారో  తెల్సుకోడం ఓ యిదిగా ఉండేది. మన అమామీకుడున్నాడు కదండీ ( వాడికేం పేరుపెట్టలేదు ) ఆడికి దారిలో యేగాని దొరికినాది. దాంతో సుట్టముక్క కొనుక్కుంటానని ఆడంటే, ఆడి పెల్లం ఒల్లకో ఆ డబ్బియ్యి ఈ రోజు రేతిరికి పిల్లగాల్లకి తింటాని కేటీనేదు. అంటూ లాక్కుంది. ఓసె.... యేగానికేటొత్తాదే అనేలోపు మావా! సెట్టికొట్టుకెల్లి ఏదోటి అట్టుకొత్తానుగానీ సిటం ఆగవో అంటూ లగెత్తింది.  
                               అంత రాత్రిపూట ఓ ఆడది వీధులోకి వెళ్తుంటే ఏం జరుగుతోందో తెల్సుకోడనికి ఆ సత్రం ముందటే మాటేసి రాజూ మంత్రి గమనించసాగారు. ఆవిడ కోమటి కొట్టుకెళ్ళి పాకిపోయిన బెల్లం చవగ్గా వస్తోందని సెట్టినడిగి కొనుక్కొచ్చింది. అసలే ఆషాఢమాసం సత్రంలో ఈగలెక్కువ వాటిని తోలుకుంటూ ఈ బెల్లంతో ఏం చేద్దునా అని ఆలోచిస్తూ.....  తన భర్తకి ఈగల్ని తోలే పని అప్పగించి బిందట్టుకుని నీళ్ళకోసం వెళ్ళిందావిడ. 
                             పనిలేని మంగలి పిల్లి బుర్ర గొరిగేడన్నట్లు మనవాడు బెల్లంమీద వాలుతున్న ప్రతీ ఈగనీ ఠాప్.. ఠప్.. మని కొట్టి చంపి పడేస్తున్నాడు. దానికితోడు లెక్కపెడుతూ 1, 9,16 ,36, 52, 78, 93 అంటూ 99 ఈగను కూడా చంపి పడేసాడు. భార్య వచ్చిన అలికిడి విని బిగ్గరగా ఆగు అలాగ..... ఇప్పటికి 99 పేణాలు తీసాను నూటికొస్తాను అంటూ వందో ఈగనుకూడా ఠాప్ మనిపించేడు. చూసిన ఆవిడ అవాక్కై నించుని మావా! అయితే నూటికి వస్తాదువైపోయావు అంటూ బుగ్గలు నొక్కుకుని మెటికలిరిసింది. 
                                 వీరి మాటలు వింటున్న రాజు మంత్రితో ఇలా అన్నాడు. మన దివాణంలో వస్తాదులున్నారు గానీ..... వీడెవడో నూటికి వస్తాదునంటున్నాడు కాబట్టి అతనిని మన దివాణానికి తరలించే ఏర్పాటు చేయండి అని చెప్పి అంతః పురానికి పోయాడు . మంత్రి పల్లకీ పంపించి నూటికొస్తాదు దంపతులను దివాణానికి ఆహ్వానించాడు. ఆ రాజెవడో - ఈ మంత్రెందుకు పిలుస్తున్నాడో అర్థం కాకపోయినా అర్ధాకలితో నకనకలాడే వారి కడుపులు దివాణంలో అడుగు పెట్టడానికి సంశయించలేదు. మన నూటికొస్తాదు భార్య కాస్త గడసరిది...  లౌక్యం గలది. తన భర్తని వంద ప్రాణాలు తీసేసిన మొనగాడిగా, మొగాడిగా రాజూ, మంత్రి గుర్తించారని గ్రహించి పూర్తి విషయాన్ని తన భర్తకి కూడా ఉపదేశం చేసి మెల్లిగా కోట్లో పాగా వేసింది. 
                                    రోజులు, నెలలూ గడుస్తున్నాయి. దివాణంలో నివసిస్తున్న నూటికొస్తాదు దంపతులకు రోజులు బాగానే గడుస్తున్నాయి. ఏ రోజూ తిండికి వెతుక్కోనక్కర లేకపోయింది. కానీ అన్ని రోజులూ ఒకలా ఉంటాయా?  మంత్రి నూటికొస్తాదును పిలిపించాడు. రావోయ్..  వంద పేణాలు తీసిన మొనగాడా, ఈ రోజు నీకు పనిబడింది. మన రాజ్యం ఊరి చివర్లో ఓ 20 మంది దొంగలు దోచుకుంటున్నారు. రాజుగారు నిన్ను పంపమన్నారు. వారిని చంపమని. నీకదేమంత పని అనుకో చిటికెలో వందమందిని చంపగలవు. ఇదే రాజుగారు చెప్పిన మొదటి పని చేయలేదనుకో చాలా ప్రమాదం. జాగ్రత్త, అంటూ హుకుం జారీ చేసాడు. 
                                  ఇంటికొస్తూనే తుండుగుడ్డ నెత్తిమీద వేసుకుని - "మన పనైపోనాదే ఒకడుగాదు ఇద్దరుగాదు ఇరవై మంది దొంగలంట. నేనే చంపాలంట.మనకి నూకలు సెల్లిపోనాయి పద ఈ రేతిరికే ఎక్కడికేనా పారిపోదాం" అన్నాడు. కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా కలయదిరిగి రాత్రికి పారిపోవాలంటే ఏదో ఓటి చేయాలి. పిల్లలకి దారిలో ఆకలైతేనో అనుకుంటూ కొద్దిగా బెల్లం నూలుపప్పు రోట్లో వేసి చీకట్లో దంచనారంభించింది. అప్పటికే రోట్లో ఓ నాగుపాము తల దాచుకుంది. చూడకుండా గబగబా దంచేస్తూ ఉండలు కట్టి నూటికొస్తాదుతో బయలుదేరింది ఆ అనుంగు సతీమణి. అదేం చిత్రమోగానీ ఆ ఉండలుకూడా ఇరవైయ్యే అయినాయి. 
                                   రాజ్యం వదిలి పారిపోతున్న వీరికి దారిలో ఎదురయ్యారు ఆ ఇరవై మంది దొంగలూ. ఓయ్.. మీ దగ్గర ఏమున్నాయో  ఇలా ఇవ్వండి అంటూ బెదిరించారు దొంగలు. డబ్బూ దస్కం మా దగ్గరేం లేవయ్యా .... అనగానే మరా మూటేమిటి అంటూ ప్రశ్నించాడు దొంగల నాయకుడు. పిల్లలకి బెల్లపుండలు బాబూ.. అంటూ ఉండగా ఎక్కడ లాక్కుంటారో అని అతని భార్య కొంగుచాటున దాచుకుంది. దొంగల ఖర్మగాలి దాచుకున్న ఇరవై ఉండలూ బాగున్నాయంటూ తలకోటీ చప్పరించారు. గప్....చుప్.... మనకుండా నురగలు కక్కుకుంటూ ఇరవై మందీ కుప్పకూలిపోయారు. వాళ్ళనలా చూసి విస్తుపోయారు నూటికొస్తాదు దంపతులు. వేగంగా తేరుకున్న అతని భార్య ఉండల్లో విషం ఉందని  విషయం గ్రహించి భర్తతో ఏవండీ నయం మనం తిన్నాం గాదు. ఊరుదాటక ముందే చచ్చేవాళ్ళం. వీళ్ళచావు మన మంచికొచ్చింది. వీళ్ళని చంపమని గదా రాజుగారి ఆదేశం. అనుకున్నది అనుకోకుండా జరిగింది. ఇంక పారిపోనక్కరలేదు. పదండి దివాణానికి ................................
                                                                                                        సశే షం.