అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సమైక్యాంధ్ర లో శ్రీ మదాంధ్ర భాగోతం



సమైక్యాంధ్ర  శ్రీ మదాంధ్ర భాగోతం


 పోతన వ్రాతగాదె తలపోతల కూతల చేతనంబుతో
నీత సమైక్య రాగ ముదయించెను భావితరాల కోశమై
నూతన శీర్షికా ప్ర కట నుద్యమ భాషల భేష జంబుతో
జూతురు సమైక్యమన్న జన జృంభిత గుంభిత భావజాలమున్ //

రాజరికము పోయె రాజ్యంబు గలదేని
ప్రజల సామ్యమొచ్చె ప్రభుత కొరకు
రాజకీయమందు రాక్షస క్రీడలా 
నాడు పాడిగాదు నేడు నదియె //

తంత్రమేది గాని తాదాత్మ్యమొక్కటే
స్వేచ్ఛలేని నాడు కుచ్ఛితంబు
తుచ్ఛమైన దాని తూతూల మంత్రాన 
సాగమింతునేమి బాగుగలదె //

మూడు ముక్కలాట ముచ్చట గొల్పుచో
ఆటగానె జూతురాంధ్రులెపుడు
పాటు గల్గునాడు పాల్గొనకుందురా
తాట నిలపగలరు తపన నొడమి //

ఉన్నది ఉన్నది గానొప్పు 
కన్నుగవంటేనె రెండు గానుటకొప్పున్
తిన్నగ జూడని పక్షము 
అన్నన్నా వెతల గోడు హస్తినకొచ్చెన్  (?) //

ముచ్చటింపుగాదు ముచ్చెమటలు బట్టు
మూర్ఖ యోచనంబు మూర్కొనంగ
అచ్చతెనుగు నేల నిచ్చకంబులదేల
సాధ్యపడదు మీకు భాద్యులార //



1 కామెంట్‌:

  1. ప.రా.క్రి.గారూ, మేధావులైన తమరికి దెలియనిది గాదు తెలంగాణ జనుల ఆకాంక్ష!

    కలిసి యుండఁగ వలెనన్న కావలయును
    నిరువు రంగీకృతులుగాను నిక్కముగను!
    వేఱు పడవలె నన్నచో, వేఱు పడెడి
    వారి యంగీకృతమ్మె కావలయు నంతె!!

    "మేము కలసి యుండుఁ డటన్న, మీరు కలసి
    యుండఁగా వలె! విడిపోవ నొప్పుకొనము!!
    కలసి మా తోడ నుండి, బాధలను బొంద,
    మాకుఁ బట్ట" దనెడి మాట మంచితనమె?

    ఒకఁడు విడిపోదు ననుచుండ, నొకఁడు కలసి
    జీవనము సేయఁ గోరుట, శ్రేయ మగునె?
    దోపిడీ సేయఁబడినట్టి దోష రహితు,
    "దోచుకొందును ర" మ్మనెదోయి, తగునె?

    నిన్నటి యాంధ్ర రాష్ట్రమును నిర్మితిఁ జేసినవారె మా తెనుం
    గన్నలు గోరినట్టి తెలగాణను స్వార్థవిమోహ బుద్ధులై
    యన్నును మిన్నుఁ గానక మహాంధ్ర కవుంగిలిఁ జేర్చ, నేఁడు నా
    ల్గున్నర కోట్ల తెల్గులకుఁ గొంపలు గాలె స్వరాష్ట్ర హీనతన్!

    ఆలన పాలనన్ మఱచి, యాంధ్ర ప్రదేశపు మంత్రు లెందఱో
    కాలముఁ బుచ్చుచుండఁ దెలగాణము వెన్కఁబడెన్ గదా! విప
    త్కాలము దాపురించె! సరదాలను మాని తెనుంగులార! యీ
    నేలయు నింగియున్ మొరయ నిక్కపు భక్తిని జాటి వెల్గుఁడీ!

    అదిగదిగో తెలుంగు జను లాకసమంత విశాల చిత్తులై
    పద పద మంచు మీ యెదను భక్తి సుమాలను బాదుకొల్పెడిన్
    ముద మొనఁగూడు కైతలను బొంగులు వారు ప్రయత్నయుక్తితోఁ
    బదములు పాడి, పిల్చి రిఁకపై గెలువం దెలగాణ రాష్ట్రమున్!

    నాయక ముఖ్యు లెందఱొ ప్రణాళికలన్ రచియించి, రాష్ట్రమున్
    న్యాయ పథాన వేగముగ నందఁగ నెంచి, సభల్ విరాజిలన్
    జేయు వచో విజృంభణ విశిష్టతలన్ వెలయించి, తెల్గులన్
    వేయి విధాల నాదుకొన వేచియు నుండిరి రండురం డిఁకన్!

    "నా తెలగాణ! కోటి రతనమ్ముల వీణ" యటంచుఁ బల్కి, తా
    నేతగ నుండి, పోరి, చెఱ నిల్చి, "నిజాము పిశాచమా! మహా
    భూతమ!" యంచుఁ బిల్చి, మన పూర్వపుఁ దెల్గుల విల్వఁ బెంచు ధీ
    దాతయు, శక్తి యుక్తుఁ డగు "దాశరథి" త్వర మార్గదర్శియౌ!

    మా తెలంగాణ ప్రజల సన్మానసముల
    బాధ పెట్టక యుండ సంప్రార్థన లివె!
    ప్రాంతములుగాను విడిపోయి, భ్రాతలుగను
    కలిసి యుందము సీమాంధ్ర ఘనత యెసఁగ!!

    భవదీయ సోదరుడు,
    గుండు మధుసూదన్,
    "నా తెలంగాణ కోటి రత్నాల వీణ"
    (ratnaalaveena.blogspot.in)

    రిప్లయితొలగించండి